అమరావతి ;
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సిఎంఒ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తును మంగళవారం ప్రారంభించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీల ప్రక్రియను మే 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు.
బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మూడు వెబ్‌పోర్టల్ ద్వారా మూడు ఆప్షన్లను అధికారులు తెరమీదకు తేనున్నట్లు సమాచారం.
బదిలీలు కావాల్సిన ఉద్యోగులు తప్పనిసరిగా వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బదిలీలకు మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తరచూ ఆస్పత్రులు సందర్శిస్తున్నవారు కాగా, రెండో ప్రాధాన్యతగా పరస్పర బదిలీలు (మ్యూచువల్) కోరుతున్నవారు ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు చెరొక ప్రాంతంలో పనిచేస్తున్న వారై ఉండాలి.
ఇద్దరు కూడా ఒకే జిల్లా పరిధిలో పనిచేస్తుండాలనే నిబంధన కింద బదిలీలు చేపట్టనున్నట్లు తెలిసింది.
మూడో ఆప్షన్ కింద సాధారణ బదిలీలను ఖాళీలను బట్టి చేపట్టేందుకు వీలుగా ఆఫ్షన్లను వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు సమాచారం.
అంతర్ జిల్లాల బదిలీల ప్రక్రియ కూడా మే నెలలో చేపట్టే బదిలీల్లో ఉంటుందా? లేక ఆయా బదిలీలకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా? లేదా అనే అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవేళ అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాల్సి వస్తే భార్యాభర్తలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ప్రక్రియను చేపట్టవచ్చని తెలుస్తోంది.
బదిలీల్లో మొదటి విడతలో ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులకు మాత్రమే స్థానం ఉంటుందా? లేక తాజాగా ఇటీవల ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులను కూడా బదిలీల జాబితాలో చేరుస్తారా? లేదా అనే అంశంపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది.
రెండేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు ఉండొచ్చని తెలుస్తోంది.

